ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతి నిధి)
ప్రతిష్టాత్మక 17వ ‘సౌత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2027’కు ఖమ్మం నగరం వేదిక కానుంది. ఈ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోరుతూ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సోమవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాను కలిసి విజ్ఞప్తి చేశారు. భూటాన్ రాజధాని థింపూలో జూలై 1న జరిగిన SABPF ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఛాంపియన్‌షిప్‌ను ఖమ్మంలో నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన విషయాన్ని మంత్రికి వివరించారు.
దక్షిణ ఆసియా దేశాల నుంచి సుమారు 150 మంది అథ్లెట్లు, 300 మందికి పైగా టెక్నికల్, ఇతర అధికారులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి లాంఛనప్రాయ ఆమోదం (NOC) లభించిన అనంతరం SABPFతో చర్చించి పోటీల తేదీలు, షెడ్యూల్‌ను ఖరారు చేస్తామని చెప్పారు. దీనిపై మంత్రి మాండవియా సూత్రప్రాయంగా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ వెల్లడించారు.
ఖమ్మంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు జరగడం స్థానిక క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకరమని క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు స్వామి రమేష్ కుమార్ ఎంపీ రఘురాం రెడ్డి చొరవను అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



