పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం: గ్రామం గౌడ వీధిలో విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. గణనాథుడి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించిన అనంతరం గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. భక్తులు “గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిమజ్జన సమయంలో యువత, గ్రామస్తులు నీటిలోకి దిగి ఆనందోత్సాహాలతో వేడుకను నిర్వహించారు. భక్తి, ఆనందం, స్నేహభావం కలగలిసిన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వేడుకలో పాల్గొన్న వారి ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని గణనాథుడిని ప్రార్థిస్తూ విజయ గణపతి నిమజ్జన వేడుకలను ఘనంగా ముగించారు.


