అనపర్తి, జూలై 27 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి మండలం పొలమూరులోని ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ధైర్యసాహసాలతో పోరాడి అమరులైన వీర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్.కె. రాజు, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు సైనికులు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన వీరత్వం, ధైర్యం, దేశభక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
కార్గిల్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, వారి త్యాగాల ఫలితంగానే దేశం సురక్షితంగా ఉందని తెలిపారు. అనంతరం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


