హైదరాబాద్, గాంధీ భవన్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వి. నరేందర్ రెడ్డి సమావేశమై రాబోయే వ్యవసాయ పరపతి సహకార సంఘాల (పీఏసీఎస్) డైరెక్టర్లు, చైర్మన్లు, అలాగే నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు.
సమావేశంలో 60 శాతం నామినేటెడ్ పోస్టులను మాజీ మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గంలో పనిచేసిన నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, నియోజకవర్గ సీనియర్ నాయకులకు కేటాయించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో సమావేశమై ఆశావహుల జాబితాను సమన్వయంతో రూపొందించనున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను సిద్ధం చేసిన అనంతరం ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు సంయుక్తంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.



