రాజమహేంద్రవరం, జూలై 30 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
తూర్పుగోదావరి సాగునీటి సలహా మండలి సమావేశంలో ఖరీఫ్ పంటలు, ఎల్ నినో ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, I.A.S, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్ష అనంతరం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం 2027 జూలై వరకు కొనసాగే అవకాశం ఉందని, గోదావరి డెల్టాకు ప్రస్తుతం నీటి లభ్యత ఉన్నప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా హైడ్రో, విండ్ విద్యుత్ ఉత్పత్తి తగ్గి థర్మల్ పవర్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్‌ను ప్రోత్సహిస్తోందని, ప్రతి రైతు తప్పనిసరిగా పంట బీమా చేయించుకొని నష్టపరిహారం పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రజలు అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.



