* అధికారులతో కలిసి కూటమి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలి..
* గంగిరెడ్డిపల్లిలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని, డీసీసీబీ ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి..
* *పున్నమి ప్రతినిధి,రామచంద్రాపురం*
* తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, రామచంద్రాపురం మండలం, గంగిరెడ్డిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారికి, డీసీసీబీ ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి గారికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. నాయకులు శాలువాలతో సత్కరించి, భారీ గజమాలతో ఆత్మీయ స్వాగతం పలకగా.. నియోజకవర్గ యువత బాణాసంచా కాలుస్తూ, నినాదాలతో హోరెత్తించారు. గ్రామంలోని మహిళలు సాంప్రదాయబద్ధంగా మంగళ హారతులు ఇచ్చి, దిష్టి తీసి ఆత్మీయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
* *ఇంటివద్దకే పింఛన్.. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం..*
* ప్రతీ నెల 1వ తేదీన క్రమం తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఈ నెల కూడా లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం వృద్దాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, హెచ్ఐవి వ్యాధి గ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ ను ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే పులివర్తి నాని, డీసీసీబీ ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డిలు వారికి పింఛన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
* *ప్రజా సమస్యల తెలుసుకుంటూ.. ప్రగతి దిశగా అడుగులు*
* పింఛన్ల పంపిణీతో పాటు ఎమ్మెల్యే గారు లబ్ధిదారులతో, స్థానిక ప్రజలతో మమేకమై గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సామాజిక భద్రతకు ఒక బలమైన భరోసా కల్పిస్తాయని తెలిపారు. మండలంలో ఎక్కడా ఒక్కరు కూడా మిగిలిపోకుండా 100 శాతం పింఛను పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. కూటమి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులందరికీ పింఛన్లు అందేలా చూడాలని పిలుపునిచ్చారు.
ఈ పింఛను పంపిణీ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు మరియు పింఛన్దారులు పాల్గొన్నారు.




