విశాఖపట్నంజిల్లా , (పున్నమి ప్రతినిధి) సెప్టెంబర్ 25:
విశాఖ జిల్లా ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ (ఆర్.డి.) కార్యాలయంలో ఇటీవల జరిగిన ఉద్యోగుల ప్రమోషన్లపై వివాదం నెలకొంది. ప్రమోషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా ఇచ్చిన ప్రమోషన్లను రద్దు చేయాలని ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఇంచార్జ్, ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలై 7న విశాఖ జిల్లా ఆరోగ్యశాఖలో సీనియర్ అసిస్టెంట్లను సూపరింటెండెంట్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు కౌన్సెలింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ ప్రక్రియలో అర్హత, సీనియారిటీకి సంబంధించిన నిబంధనలను పక్కనపెట్టి కొందరికి ప్రమోషన్లు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
అర్హులైన సీనియర్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టారనే అంశంపై ఇప్పటికే పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని, విచారణ కొనసాగుతున్న సమయంలోనే సంబంధిత కార్యాలయంలో కొందరు సిబ్బంది ప్రమోషన్లు పొందిన వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.
విశాఖ ఆర్టీసీ (ఎఫ్) సెంటర్‌లో పనిచేస్తున్న సీహెచ్. రవికుమార్‌కు ఇచ్చిన ప్రమోషన్‌పై కూడా పలు అభ్యంతరాలు ఉన్నాయని జక్కు నరసింహమూర్తి తెలిపారు. ఆయనకు సంబంధించిన అంశాలపై న్యాయపరమైన వ్యవహారం పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రమోషన్ విషయంలో నిబంధనలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇచ్చినట్లు తేలితే వాటిని రద్దు చేయాలని, అర్హత కలిగిన సీనియర్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రజా సంకల్ప వేదిక తరఫున జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు.


