ఖమ్మం, జూలై 24 (పున్నమి న్యూస్):
ఆగస్టు 1 నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న నిర్మాణ పనులను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు.
హైదరాబాద్, సూర్యాపేట వైపు నుంచి వచ్చే వాహనాలు తల్లంపాడు మీదుగా దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేలోకి ప్రవేశించి ప్రయాణం కొనసాగించనున్నాయి. ఇందుకు అవసరమైన అనుసంధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులు తుది దశకు చేరుకున్నాయి.
ఆగస్టు 1 నాటికి పనులు పూర్తిచేసి దంసలపురం జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు ప్రయాణించే వాహనాలకు ప్రయాణ సమయం తగ్గి, వేగవంతమైన రాకపోకలు సాగనున్నాయి.
గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడంతో ఖమ్మం జిల్లా మీదుగా ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కలగనుంది.



