ఖమ్మం రూరల్, జూలై
(పున్నమి న్యూస్)
రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.
ఖమ్మం రూరల్ మండలంలో రూ.7.21 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. డాక్యా తండాలో రూ.1.41 కోట్లతో మంగళగూడెం–డాక్యా తండా రోడ్డు, పల్లెగూడెంలో రూ.5.80 కోట్లతో గొల్లగూడెం నుంచి ఎన్ఎస్పీ మీదుగా పల్లెగూడెం వరకు నిర్మించే రహదారులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి రూ.6 వేల చొప్పున కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9,200 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ ద్వారా 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల భారం తగ్గించామని చెప్పారు. సన్న వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం నాలుగు విడతల్లో అమలు అవుతుందని, ఇప్పటివరకు 7 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. మిగిలిన అర్హులందరికీ కూడా దశలవారీగా ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు.



