మన్యం గిరిజనుల హక్కుల కోసం సాయుధ పోరాటం చేసి, బ్రిటిష్ పాలకులను ఎదిరించిన మహనీయుడు, అల్లూరి సీతారామరాజు. ఈయన 1897 జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆయన కుటుంబం వివిధ ప్రాంతాలు తిరుగుతూ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయించింది. స్థానికులు రామరాజును మన్యం వీరుడు అని పిలిచేవారు. చిన్నతనం నుంచే ఆయనకు ఆధ్యాత్మికత, గుర్రపు స్వారీ, ఆయుర్వేద వైద్యం మరియు యుద్ధ విద్యలపై ఆసక్తి ఉండేది. అల్లూరి సీతారామరాజు తూర్పు కనుమలలోని అటవీ ప్రాంతంలో పర్యటించి, గిరిజనుల దీనస్థితిని, బ్రిటిష్ వారి దోపిడీని కళ్లారాచూసి, గిరిజనులను సమీకరించి, వారిలో చైతన్యం నింపి 1922లో రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం వంటి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి, బ్రిటిష్ వారి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోరాట పటిమ గిరిల్లా యుద్ధ పద్ధతులను అవలంబించి బ్రిటిష్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టారు. బ్రిటిష్ పాలకులు ఆయనను పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నించినా, మన్యం ప్రజల సహకారంతో తప్పించుకుంటూ వచ్చారు. అల్లూరి చేసిన ఈ వీరోచిత పోరాటం తెలుగు వారిలో స్వాతంత్ర కాంక్షను మరింత రగిలించింది. బ్రిటిష్ సైన్యం మన్యంలో అల్లూరి ని పట్టుకోవడానికి అనుచరులపై, గిరిజనులపై తీవ్రమైన దాడులు చేసేవారు. గిరిజనులకు ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతో, అల్లూరి స్వయంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డారు.1924 మే 7న ఆయనను బ్రిటిష్ అధికారులు పట్టుకుని, ఎలాంటి విచారణ లేకుండా కాల్చడంతో వారి చేతిలో వీరమరణం పొందారు. అల్లూరి సీతారామరాజు జీవితం, త్యాగం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పవచ్చు. నేడు స్వర్గీయ అల్లూరి రామరాజు గారి 129వ జయంతి సందర్భంగా పాఠకుల కోసం ఈ కవితాక్షరి
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
*వీ* విజ్ఞాన వీరుడు దాస్య శృంఖలాలు తెంచగ
మన్యం అడవుల్లో విప్లవ శంఖం పూరించిన యోధుడు
*ర* రక్షకభట నిలయాల ఆయుధాలు కొల్లగొట్టగ బ్రిటిష్ గుండెల్లో పిడుగైన మన్యం ప్రజారక్షకుడు
*కి* కీడు తలపెట్టే ఆంగ్లేయులను అణిచివేయగ అన్యాయపు చట్టాలను ఎదిరించిన త్యాగధనుడు
*శో* శోభాయమానమైన ప్రకృతిలో పంటలు పండించగ కష్టంచేవారి ఆరోగ్యాన్ని కాపాడిన వైద్యుడు
*రం* రంప తిరుగుబాటుకు నాయకుడు మన్యం ప్రజల ఆరాధకుడు తెలుగు నేల కీర్తించు అమరుడు
*రా* రామరాజుగ ఆంగ్లేయులకు సింహస్వప్నమై ప్రజల గుండెల్లో స్థిరస్థాయుడు
*మ* మన్యం వీరుడుగ ప్రజా ప్రేమికుడిగా బ్రిటిష్ వారికి లొంగిపోయిన స్ఫూర్తి ధీరుడు
*రా* రాజీలేని పోరాటం స్వతంత్ర రాజ్యానికై ఆరాటం తో గిరిజనుల హక్కుకై నిలిచిన సహృదయుడు
*జు* జువ్వాగ ఎదిగిన అడవిరాజు సీతారామరాజుగా చిరస్మరణీయుడు
🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹


