సంబరాలకే పరిమితం కాకుండా సమాజహితం కోసం కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ వినూత్న కార్యక్రమం
విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, సెప్టెంబరు 28 (పున్నమి ప్రతినిధి):
పుట్టినరోజు అంటే కేవలం కేక్ కటింగ్‌లు, వేడుకలే కాదు.. నలుగురికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతోనూ చిరస్మరణీయంగా మార్చుకోవచ్చని నిరూపించారు వేములవలసకు చెందిన కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్. తన పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఉచిత వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరం నిర్వహించి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. వ్యక్తిగత ఆనందాన్ని సామాజిక బాధ్యతగా మలుచుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలిచారు.
50 మందికి వైద్య పరీక్షలు.. 10 యూనిట్ల రక్తదానం
మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 50 మందికి రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించారు. వైద్య సిబ్బంది పరీక్షల అనంతరం ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు అందించారు. అనంతరం లైఫ్ షేర్ రక్తనిధి సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో స్వచ్ఛంద దాతలు 10 యూనిట్ల రక్తాన్ని అందించారు.
సేవలోనే నిజమైన సంతోషం..
ఈ సందర్భంగా కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలను కేవలం వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఈ సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదని, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, ముడసల శ్రీను, కొట్యాడ శ్యామ్‌కుమార్, నడిమింటి అప్పలరాజు, శ్రీరామ్, సోమునాయుడు, లైఫ్ షేర్ రక్తనిధి సిబ్బంది, మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్థులు, స్థానికులు సేవా కార్యక్రమాలను అభినందించారు.




