తూర్పుగోదావరి జిల్లా (పున్నమి ప్రతినిధి)
తీవ్ర తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాడిపూడి గ్రామానికి చెందిన సొసైటీ చైర్మన్ నాము కొండబాబు సూచించారు. వర్షాల కారణంగా గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
గ్రామంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే పనులు చేపడుతున్నామని చైర్మన్ నాము కొండబాబు వెల్లడించారు. ప్రధానంగా వర్షపు నీరు సక్రమంగా బయటకు వెళ్లేలా కాలువలు, డ్రైనేజీలను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో పాడుబడిన ఇళ్లలో ఎవరూ నివసించవద్దని ఆయన సూచించారు. బలహీనంగా ఉన్న ఇళ్లలో ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు వాతావరణ పరిస్థితుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అదేవిధంగా ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలు, చెట్లు, పాత భవనాల సమీపంలో ఉండకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.


