లారీ ఢీకొని ఎస్సైకు తీవ్ర గాయాలు
క్షతగాత్రులను పరామర్శించిన తుంబూరు దయాకర్ రెడ్డి
తిరుమలాయపాలెం: వినాయక నిమజ్జనం సందర్భంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొనడంతో తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్, డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై భవాని హోటల్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో ఎస్సై జగదీష్‌కు గాయాలు కాగా, డ్రైవర్ రాకేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఖమ్మంలోని స్తంభాద్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాకేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే రాకేష్‌ను ఉన్నత స్థాయి ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.


