మెగా డీఎస్సీపై పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్య డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులపై దాడులు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్‌లపై రౌడీషీట్లు తెరవాలని కోరారు.సోమవారం ఆయన ఒంటిమిట్టలో విలేకరులతో మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులు తాము అన్ని విధాలా అర్హత కలిగిన వారమని, చెల్లుబాటు అయ్యే స్పోర్ట్స్ సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు పొందామని చెబుతున్నారని తెలిపారు. తమ అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను బహిరంగంగా ప్రదర్శిస్తూ ఎస్ఏపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన సమయంలో వారిపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ అర్హతలను వెల్లడిస్తూ వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నారని నరసయ్య పేర్కొన్నారు. అయినప్పటికీ డీఎస్సీ నియామకాలపై తప్పుడు ప్రచారం కొనసాగించడం సరికాదన్నారు. సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు.స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 14 డీఎస్సీలు నిర్వహించగా, వాటిలో తొమ్మిది డీఎస్సీల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో సుమారు రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించినట్లు నరసయ్య తెలిపారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో చేసిన ప్రకటనలు ఆచరణలో అమలు కాలేదని విమర్శించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


