మినగల్లు గ్రామంలో ఘటన.. రూ.150 బాకీ విషయమై దాడి
ఆత్మకూరు, సెప్టెంబర్ 21 (పున్నమి ప్రతినిధి):అనంతసాగరం మండలం మినగల్లు గ్రామంలో సెప్టెంబర్ 16న రాత్రి జరిగిన దాడి ఘటనకు సంబంధించి షేక్ నూర్ బాషా (46)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆత్మకూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి టీ. వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మినగల్లు గ్రామానికి చెందిన ఒరుగంటి చిన్నయ్య (66)కు నిందితుడి దుకాణంలో రూ.150 బాకీ ఉంది. సంఘటన రోజున ఇంటికి వెళ్తున్న చిన్నయ్యను నూర్ బాషా అడ్డుకుని బాకీ డబ్బుల విషయమై ప్రశ్నించి, అతని వద్ద ఉన్న కర్రను తీసుకుని పలుమార్లు కొట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో చిన్నయ్య చేతులు, కాలు తదితర భాగాల్లో ఎముకలు విరిగి, ఇతర గాయాలయ్యాయి.
గాయపడిన చిన్నయ్యను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సాక్షులను విచారించి, ఆధారాలు సేకరించిన అనంతరం సెప్టెంబర్ 21న నూర్ బాషాను అరెస్టు చేశారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


