చాగాపురం ఘటనపై బాధితులను పరామర్శించిన MNS రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఏదుల నాగరాజు
“కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దు – పోలీసుల పాత్రపైనా సమగ్ర విచారణ జరగాలి”
జోగులాంబ గద్వాల్ జులై 03(పున్నమి ప్రతినిధి)
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడిన బాధిత కుటుంబాలను మూఢనమ్మకాల నిర్ములన సంఘo తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఏదుల నాగరాజు పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో MNS జోగులాంబ గద్వాల జిల్లా ఉపాధ్యక్షులు నూనె ఎర్రన్న, ఏదుల ధనంతిమ్మప్ప, ఆరగిద్ద గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏదుల నాగరాజు మాట్లాడుతూ, కులం, మతం, దేవుడి పేరు మీద ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ప్రతి సమస్యను రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, శాస్త్రీయ దృక్పథంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఆవేశానికి లోనై ఘర్షణలకు దిగడం వల్ల అమాయక ప్రజలే నష్టపోతారని, ముఖ్యంగా యువత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
చాగాపురం ఘటనలో గాయపడిన ఎస్సీ మాదిగ కుటుంబాలను పరామర్శించిన ఆయన, బాధితులకు ధైర్యం చెబుతూ MNS వారి పక్షాన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ ఘటనలో పోలీసుల వ్యవహారంపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితిని ముందుగానే సమర్థవంతంగా నియంత్రించి ఉంటే ఘర్షణ ఈ స్థాయికి వెళ్లేదా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. లాఠీచార్జ్‌కు దారితీసిన పరిస్థితులు, పోలీసుల చర్యలు, ఘటనకు దారితీసిన అసలు కారణాలపై స్వతంత్రంగా, నిష్పాక్షికంగా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
అదేవిధంగా, ఈ ఘటనను రాజకీయ లేదా కులపరమైన లబ్ధి కోసం ఎవరూ ఉపయోగించుకోవద్దని, గ్రామంలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలని కోరడమైనది


