తెలంగాణ సప్త సంకల్పాలను ప్రభుత్వం అమలు చేయాలి: బీజేపీ
మంథని, సెప్టెంబర్ 15:
సెప్టెంబర్ 17వ తేదీని ప్రతి సంవత్సరం తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంథని తహశీల్దార్ ఆరిఫోద్దీన్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేపట్టిన కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొని ప్రభుత్వం దృష్టికి తెలంగాణ సప్త సంకల్పాలను తీసుకెళ్లారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. తెలంగాణ ప్రజల పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు._బీజేపీ తెలంగాణ సప్త సంకల్పాలు_సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రతి సంవత్సరం నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. తెలంగాణ విమోచనలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ సేవలకు గుర్తుగా హైదరాబాద్లో భారీ ‘విమోచన తెలంగాణ’ స్మారక విగ్రహం లేదా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. అదేవిధంగా హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ విమోచన మ్యూజియం ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించిన అమరవీరులు, స్థానిక పోరాట యోధులు, వారి త్యాగాలు, ఉద్యమ చరిత్రను భద్రపరిచేలా తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన చరిత్రను విద్యార్థులకు అందించేందుకు పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలు, జమీందారీ, జాగీర్దారీ దోపిడీ, ప్రజల పోరాటం, అమరవీరుల త్యాగాలు, గుర్తింపు లభించని పోరాట యోధుల అధికారిక జాబితా, హైదరాబాద్ విమోచనకు దారితీసిన ఆపరేషన్ పోలో తదితర అంశాలను చేర్చాలని కోరారు. రజాకార్ల దాడులు, దౌర్జన్యాలకు గురైన గ్రామాలను గుర్తించి అక్కడ తెలంగాణ విమోచన స్మారక స్థూపాలు నిర్మించాలని, తెలంగాణ విమోచన ఉద్యమానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను కలుపుతూ ప్రత్యేక విమోచన పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, మంథని మండలంలో కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోగోజు శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు బుడిద తిరుపతి, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు సామల అశోక్, ఏడ్ల సాగర్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గుడ్ల గురువేష్, తదితరులు పాల్గొన్నారు.

