సీతారాం ప్రాజెక్టుతో రైతులకు ఒరిగేదేమీ లేదు
జులై 23 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఉమ్మడి ఖమ్మం జిల్లా:
ఏన్కూరు
బంగారం పండే పొలాలు పోయాయి… నీరు మాత్రం మాకు రాలేదు” – రైతుల ఆవేదన రైతులు ఎంతో ఆశలు పెట్టుకున్న సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని రైతులు తీవ్ర ఆవేదన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశించిన తమకు చివరికి భూములు కోల్పోవడం తప్ప ఎలాంటి లాభం దక్కలేదని రైతులు వాపోతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం వందలాది ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూములను సేకరించింది. తరతరాలుగా వ్యవసాయం చేసి జీవనం సాగించిన రైతులు తమ భూములను ప్రాజెక్టు కోసం అప్పగించినప్పటికీ, నేటికీ ఆ ప్రాజెక్టు ద్వారా తమ పొలాలకు సాగునీరు అందకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వారు పేర్కొంటున్నారు.
కాలువ ద్వారా వచ్చే నీటిని వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గ తదితర ప్రాంతాలకు మళ్లించారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు మాత్రం సాగునీరు అందకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తున్నారు.
భూగర్భ జలాల పెరుగుదల కూడా లేదు కాలువకు ఇరువైపులా పూర్తిగా సీసీ లైనింగ్ నిర్మించడం వల్ల నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరగడం లేదని, బోర్లు, బావుల్లో నీటి మట్టం కూడా మెరుగుపడలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పశువులకు, గ్రామాలకు కూడా ప్రయోజనం లేదు
కాలువలో ప్రవహించే నీటిని పశువులు తాగేందుకు, గ్రామ ప్రజలు అవసరాలకు వినియోగించుకునే అవకాశం కూడా లేకుండా పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు తమ ప్రాంతం గుండా వెళ్తున్నప్పటికీ, దాని ప్రయోజనం తమకు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


