*వైఎస్సార్సీపీ ఆరోపణలపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఫైర్*
* చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికలపై కనీస అవగాహన లేదు: రూప్ కుమార్ యాదవ్
* నెల్లూరులో ఇల్లే లేదు.. కానీ 28 దొంగ ఓట్లు ఉన్నాయి: డిప్యూటీ మేయర్ సంచలన వ్యాఖ్యలు
* SIR ప్రక్రియలో ఓట్ల తొలగింపు ఉండదు.. అవగాహన లేకుండా మాట్లాడొద్దు
* మంత్రి నారాయణపై ఇసుక ఆరోపణలు ముమ్మాటికీ అబద్ధం: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్
* మీడియా ముందుకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకోండి: వైఎస్సార్సీపీకి రూప్ కుమార్ హితవు
నెల్లూరులో ఓటర్ల జాబితా సవరణ SIR ప్రక్రియపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు మీడియా ముందుకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికిన ఆయన, జూన్ 15 నుండి జూలై 14 వరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో ఓట్ల తొలగింపుగానీ, చేర్పుగానీ ఉండదని, కేవలం ఓటర్ల వివరాల సేకరణ, డిజిటలైజేషన్ మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇప్పటికే 72 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తయిందని, కలెక్టర్ ప్రతిరోజూ ఈ వివరాలను అన్ని పార్టీలకూ అధికారికంగా అందిస్తున్నారని చెబుతూ, ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్తకైనా ఎన్యుమరేషన్ ఫారం అందలేదని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. 47వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ నాయకులే స్వయంగా బీఎల్ఓల పక్కన కూర్చుని ఫారాలు పూర్తి చేయిస్తున్నారని, 238వ బూత్ ప్రక్రియపై అనుమానాలు ఉంటే వారి పార్టీ కార్పొరేటర్ నాగార్జునని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేవలం 20 వేల ఓట్లతో గెలిచిన చంద్రశేఖర్ రెడ్డికి సాధారణ ఎన్నికలపై అవగాహన లేదన్న ఆయన, నెల్లూరులోని రామ్మూర్తి నగర్ డోర్ నెంబర్ 15-6-43 లో కనీసం ఇల్లే లేకపోయినా ఏకంగా 28 దొంగ ఓట్లు ఉన్నాయని, ఇలాంటివి నగరంలో మరెన్నో ఉన్నాయని ధ్వజమెత్తారు. అలాగే మంత్రి నారాయణ గారిపై చేస్తున్న ఇసుక అక్రమాల ఆరోపణలు అబద్ధమని, మంత్రి నారాయణ గారి విజన్ ప్రజలకు తెలుసన్నారు..గతంలో 4 వేలు ఉన్న ట్రాక్టర్ ఇసుకను నారాయణ గారు చొరవ తీసుకుని 1,200 లకే పేదలకు అందేలా చేశారని గుర్తు చేస్తూ, అభ్యంతరాలు ఉంటే అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి తప్ప అబద్ధాలు ప్రచారం చేయవద్దని హితవు పలికారు.


