వృత్తి జీవితం – 1 పనివేళలో అదనపు గంట ( 1 ) కొన్ని సంవత్సరాల క్రితం టైం మేనేజిమెంటు విూద ఒక వర్క్ షాపు నిర్వహిస్తూ, ఒక ఆస్తక్తి కరమైన సర్వే చేశాం . ఆ ట్రెనింగ్ ప్రోగ్రాంలో ఒక 30 మంది ఉన్నారు. 40 నుంచి 50 మధ్య వయసు వారు. మధ్య స్థాయి మేనేజలు. వారిని ఒక ప్రశ్న అడిగాం. ”మేడమ్స్ అండ్ సార్స్. మాకు తెలుసు విూరంతా తమ తమ పనుల్లో, ఉద్యోగాలలో బిజీ. సకాలంలోపూర్తి చేయాల్సిన పని వత్తిడి కూడా విూ విూద ఉంది . ఇది తెలిసి కూడా, విూ బాసు, విూకు ఒక అదనపు పని లేదా ప్రాజక్టు వప్ప జెప్పారు . విూరు దాన్ని స్వీకరిస్తారా? అయితే, ఈ అదనపు పనికి గాను విూకు అదనపు జీతం / బోనస్ లేదా ఓవర్ టైం వంటి అదనపు పారితోషికం ఉండదు! ఎవరు టేకప్ చేస్తారో చేతులె త్తండి ! ”అని ఒక్క చెయ్యి కూడా పైకిపోలేదు . కొంతమంది అన్నారు , ‘మాకు ఉన్న పని వత్తిడితో, మేము ఎక్స్‌ట్రా పని చేయలేము సార్ అని మా బాస్‌తో చెబుతాము ‘అని మరి కొందరు’ విూరు చెప్పిన అదనపు బాధ్యత తప్పకుండా స్వీకరిస్తాను సర్. కానీ, నా చేతిలో ఉన్న పనిలో కొంత భాగం మరొకరికి అప్పగించగలరా? లేదా, నాకు అప్పగించిన పని పూర్తి చెయ్యడానికి మరికొంత సమయం ఇవ్వగలరా? నా ప్రాజక్టు డెడ్ లైను కొంత పొడిగించగలరా? అని వారి పై అధికారులతో ‘నెగోషియేట్ ‘ ( బేరసారాలు ) చేస్తాము అని చెప్పారు ! బాగుంది ఐడియా. కానీ, మేము అడిగిన ప్రశ్నలో, వారు కోరే ఆ రెండు వెసులుబాట్లూ ఉండవు అని చెప్పాము. అలాంటప్పుడు ఏమి చేస్తారు? అని మళ్ళీ అడిగాము కాస్త మెతక స్వభావం ఉన్న వారు, ‘మనస్పూర్తిగా అయితే ( అదనపుబాధ్యత) స్వీకరించము సర్ ! విూకు తెలుసు మా సంస్థలో ఎంత పని వత్తిడి ఉంటుందో. ఫోను స్విచ్చాఫ్ చెయ్యలేము సెలవు రోజు కూడా. ఇకపై అధికారి అడిగారు కాబట్టి, నో చెప్పలేము కాబట్టి టేకప్ చేస్తాం. మాకు చేతనయినంత వరకు చేస్తాం . కానీ,2 పడవల విూద కాళ్ళు పెడితే, పని నాణ్యత దెబ్బ తింటుంది. మా ఆరోగ్యాలూ పాడవుతాయి ! అని మా మేనేజిమెంటు వారికి విూరయినా చెప్పండి ‘అని మాతో అన్నారు .ఆ ట్రెయినింగ్ కి వచ్చిన మరొక మేనేజర్ జోక్ చేశారు, ఇలా. ”ఏదో టైం మేనేజిమెంటు పైన ట్రెయినింగ్ ప్రోగ్రాం – అంటే ఇలా వచ్చాం. విూరేదో మాకు నేర్పుతారని ఇలాంటి ఫిట్టింగులు పెడతారు అనుకోలేదు” అని. అందరూ గొల్లున నవ్వారు! సో, ఏతావాతా, మనస్పూర్తిగా ఎవ్వరూ చేతులెత్త లేదు. అప్పుడు మరో ప్రశ్న జోడించాం. అయితే , ఈ అదనపు ప్రాజక్టు విూరు ఒప్పుకుంటే, రోజుకు ఒక గంట అదనంగా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది . కానీ, విూకు విూ కంపెనీ యజమాని /ఎండీతో నేరుగా కలిసి పని చేసే అవకాశం ఉంటుంది ! విూరు ఆయన కి మెయిల్ పంప వచ్చు. ఆయన విూకు ఫోన్ చేస్తూ ఉంటారు! అని. ఈ సారి దాదాపు అందరూ చెయి పైకి లేపారు . దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉద్యోగులలో నిజమైన సందిగ్ధం ! చూస్తూచూస్తూ ఇలాంటి అవకాశం ఎవరు వదులుకుంటారు ? కంపెనీ యజమానితో కలిసి పని చేసే అవకాశం. మనమేంటో నిరూపించుకునే అవకాశం. మన సామర్ధ్యం పైవారికి తెలిసే అవకాశం! కానీ ఎలా? మన ఉద్యోగం సేఫ్. పైగా మన పనితనం డైరక్ట్‌గా దేవుడికి తెలిస్తే, ఈ మధ్యలోని అడ్డమైన పూజారులకీ సోపు వేసే అవసరం ఉండదు ! ఇలాంటి ఆలోచనలు. కానీ, మన పని వేళలలో ఒక గంట అదనపు టైంని ఎలాగుర్తించి పట్టుకోవడం? ఈ ప్రశ్నకి జవాబులు, రేపు ఇదే సమయానికి… (12-10-2019)