పువ్వాడ నాగేంద్ర కూమర్
(పున్నమి న్యూస్ ఖమ్మం జిల్లా రిపోర్టర్ )
చింతకాని,మే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీవోఏల సమస్యల పరిష్కారం కోరుతూ కొనసాగుతున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. గత పది రోజులుగా చింతకాని ఎంపీడీవో కార్యాలయం ఎదుట వీవోఏ వర్కర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కొండా గోపి మాట్లాడుతూ, వీవోఏల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీవోఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. అలాగే సామాజిక ఆరోగ్య బీమా రూ.20 లక్షల వరకు అందించడంతో పాటు, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జీవో నెం.58లో సవరణలు చేసి వీవోఏలకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే, వీవోఏలకు అండగా భవిష్యత్తులో కలెక్టరేట్ ముట్టడికి కూడా బీజేపీ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను, బుర్ర శ్రీను, ప్రధాన కార్యదర్శులు గోద మంగయ్య, ఇమ్మడి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కొండా వెంకన్న, అంజన సిద్ధార్థ, వేముల ఎల్లయ్య, పామర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.



