ఆత్మకూరు, ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 450 మంది విద్యార్థుల తాగునీటి సమస్యకు శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వర రెడ్డి చొరవతో పరిష్కారం లభించింది. కళాశాలలో నెలకొన్న నీటి సమస్యను అధ్యాపకులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, జూలై 30న కళాశాలను సందర్శించి సమస్యను పరిశీలించారు. ఇచ్చిన హామీ మేరకు కేవలం 19 రోజుల్లోనే రూ.2 లక్షల సొంత నిధులతో అధునాతన ఉచిత ఆర్వో జలశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.బుధవారం జరిగిన కార్యక్రమంలో పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి, స్విచ్ ఆన్ చేయడం ద్వారా ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వాణిశ్రీ, అధ్యాపకులు, విద్యార్థులు పరమేశ్వర రెడ్డిని ఘనంగా సత్కరించారు.విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని, ఇంటర్మీడియట్ రెండేళ్లు భవిష్యత్తుకు ఎంతో కీలకమని పరమేశ్వర రెడ్డి సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



