తిరుపతి జిల్లా 15 : ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ వరుసగా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ కంకి వంశి (తండ్రి: సుధాకర్, వయస్సు: 25 సంవత్సరాలు, నివాసం: సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా)పై ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ యాక్ట్, 1986 (పీడీ యాక్ట్) ప్రకారం నిర్బంధ ఉత్తర్వులు అమలు చేసినట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ప్రతిపాదన మేరకు, తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., గారు పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.
సదరు నిందితుడు సూళ్లూరుపేట, శ్రీహరికోట, తడ, నాయుడుపేట, చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాల్లో దొంగతనాలు, దాడులు, మహిళలపై వేధింపులు, ఆయుధాలతో బెదిరింపులు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు నమోదైంది. అతనిపై మొత్తం 28 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. పలుమార్లు అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ అతని నేరప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, ప్రజా శాంతి భద్రతలకు తీవ్ర ముప్పుగా మారినట్లు జిల్లా పోలీసు శాఖ గుర్తించింది.
దీంతో జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వుల మేరకు నిందితుడిని ఈరోజు కడప సెంట్రల్ జైలుకు భద్రతా ఏర్పాట్ల మధ్య తరలించి నిర్బంధించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతకు విఘాతం కలిగించే రౌడీయిజం, దౌర్జన్యాలు, మహిళలపై నేరాలు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే నేరస్థులపై కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని, అవసరమైతే పీడీ యాక్ట్ వంటి చట్టాల కింద కూడా నిర్బంధ చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజు ఉండదని హెచ్చరించారు.


