మూడు నెలలుగా నిలిచిపోయిన యాచారం–మేడిపల్లి రోడ్డు పనులు
అధికారుల నిర్లక్ష్యమా..? కాంట్రాక్టర్ అలసత్వమా..? నానా అవస్థలు పడుతున్న ప్రజలు
యాచారం, ప్రతినిధి:
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల పరిధిలో యాచారం నుంచి మల్కీజ్ గూడ మీదుగా మేడిపల్లి వరకు చేపట్టిన రహదారి నిర్మాణ పనులు గత మూడు నుంచి నాలుగు నెలలుగా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ రహదారిపై కొంత మేర పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేయడంతో ప్రస్తుతం పరిస్థితి “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్లుగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు విస్తరణ పేరుతో పాత రహదారిని తవ్వి, కంకర పరచి పనులను నిలిపివేయడంతో రహదారి మొత్తం గుంతలు, దుమ్ము, రాళ్లతో ప్రమాదకరంగా మారింది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతుండగా, అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు సైతం వేగంగా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది.
వర్షం కురిసినప్పుడు రోడ్డు బురదమయంగా మారి వాహనాలు ఇరుక్కుపోతుండగా, ఎండాకాలంలో దుమ్ము మబ్బులు కమ్ముకుని గ్రామస్థులు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు, పాల సేకరణ వాహనాలు, పాఠశాల బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా ఈ రహదారిపై ప్రయాణించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పనులు నిలిచిపోయి నెలలు గడుస్తున్నా సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించిన దాఖలాలు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశాడా? లేక అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో, ఎప్పుడు పూర్తవుతాయో కూడా అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ప్రజల్లో మరింత అసంతృప్తిని పెంచుతోంది.
ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులు ఈ విధంగా అర్ధాంతరంగా నిలిచిపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పనులు ఆలస్యం కావడంతో గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతింటోందని, ప్రమాదాల ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, రోడ్లు–భవనాల శాఖ అధికారులు స్పందించి పనులు ఎందుకు నిలిచిపోయాయో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, కాంట్రాక్టర్‌పై అవసరమైన చర్యలు తీసుకుని వెంటనే పనులను పునఃప్రారంభించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలతో రహదారి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
ప్రజల సౌకర్యం కోసం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకే భారంగా మారడం దురదృష్టకరమని, ఇకనైనా అధికారులు స్పందించి యాచారం–మల్కీజ్ గూడ–మేడిపల్లి రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


