వరి కోత యంత్రాల (హార్వెస్టర్ల) అద్దె ఛార్జీలపై వ్యవసాయ, రవాణా శాఖల సమన్వయ సమావేశం
———————————————————————–
జనగామ,సెప్టెంబర్ 29,పున్నమి జిల్లా ప్రతినిధి :
మంగళవారం, వరి సేకరణ, పంట కోతల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వరి కోత యంత్రాల (హార్వెస్టర్ల) గంట అద్దె ఛార్జీల నిర్ణయంపై వ్యవసాయ శాఖ, రవాణా శాఖ అధికారులు, హార్వెస్టర్ యజమానుల మధ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదా నష్టం కలగకుండా, వారికి అనుకూలంగా ఉండే విధంగా హార్వెస్టర్ల అద్దె ఛార్జీలను నిర్ణయించాల్సిన అవసరాన్ని అధికారులు సూచించారు. అదే సమయంలో హార్వెస్టర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్వహణ ఖర్చులు, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరస్పర అవగాహనతో నిర్ణయానికి రావాలని చర్చించారు.
హార్వెస్టర్ యజమానులు మాట్లాడుతూ.. వరి కోత యంత్రాలను ప్రధానంగా వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తున్నందున, వీటిపై కమర్షియల్ పన్ను కాకుండా పన్ను మినహాయింపు (టాక్స్ ఎగ్జెంప్షన్) కల్పించాలని అధికారులను కోరారు. హార్వెస్టర్ల నిర్వహణకు సంబంధించిన ఖర్చులు, రైతులకు అందిస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకుని పన్ను మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పంట కోత సమయంలో ధాన్యం నష్టం జరగకుండా, నాణ్యమైన రీతిలో కోత పూర్తయ్యేలా హార్వెస్టర్ల సాంకేతిక ప్రమాణాలను సక్రమంగా నిర్వహించడంపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా యంత్రాల RPM (స్పీడ్), ఫ్యాన్ బ్లేడ్లు, మోటార్ సెట్టింగ్స్ తదితర అంశాలను పంటకు అనుగుణంగా సరైన స్థాయిలో ఉంచాలని సూచించారు.
ధాన్యం నేలపై రాలిపోకుండా, పంటలోని ధాన్యం వృథా కాకుండా, తాలు లేకుండా శుభ్రంగా ధాన్యం లభించే విధంగా హార్వెస్టర్లను సాంకేతికంగా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. యంత్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల రైతులకు పంట నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హార్వెస్టర్ల అద్దెకు సంబంధించి నిర్దేశిత రేట్లు, యంత్రాల వినియోగ విధానం, పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు క్లస్టర్ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) ఆధ్వర్యంలో రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, హార్వెస్టర్ అద్దె ఛార్జీలు, కోత విధానం, యంత్రాల సాంకేతిక అంశాలపై రైతులకు పూర్తి సమాచారం అందించాలని సూచించారు. దీనివల్ల రైతులకు, హార్వెస్టర్ యజమానులకు మధ్య పరస్పర అవగాహన పెరిగి, పంట కోతల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రానున్న వరి కోతల సీజన్లో రైతులకు సకాలంలో యంత్రాలు అందుబాటులో ఉండేలా, పంట నష్టం లేకుండా కోతలు పూర్తయ్యేలా సంబంధిత శాఖలు, హార్వెస్టర్ యజమానులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జనగామ, పెంబర్తి, తదితర మండలాలకు చెందిన హార్వెస్టర్ యజమానులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.



