*లోకేష్‌కు పేరొస్తుందనే అక్కసుతోనే పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం: మాజీ మంత్రి దేవినేని ఉమా*
*పట్టిసీమపై ఒక్క మంచి మాట చెప్పలేని జగన్.. డీఎస్సీపై నీతులు చెబుతున్నారా?*
*పట్టిసీమ నీళ్లతో జరిగిన మేలుకు.. చంద్రబాబుకు జగన్ కృతజ్ఞత చెప్తూ ట్వీట్ చేయాలి*
ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి (సెప్టెంబర్ 16)
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించిన మెగా డీఎస్సీపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. గొల్లపూడి లోని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కష్టపడి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను అవమానించేలా, వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 892 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని కూడా ఓర్వలేకపోతున్నారని అన్నారు.
మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారాలతో ట్వీట్లు చేస్తున్న జగన్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. పట్టిసీమ నీటితో జరిగిన మేలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేయాలని ఉమా డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారు జన్‌జీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిలో 372 మందికి నియామకాలు లభించగా, వారిలో 326 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారేనని దేవినేని ఉమా తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన గణేష్ బోడెన్సీ సరస్సును ఈది ప్రపంచ రికార్డు సృష్టించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అదేవిధంగా పేద మత్స్యకార కుటుంబంలో పుట్టి డీఎస్సీ ఉద్యోగం సాధించిన రవికుమార్ తన ఏడాది జీతాన్ని గ్రామం కోసం, పేదల కోసం అందించి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు హామీలు ఇచ్చి మోసం చేసిన జగన్‌రెడ్డికి డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు లేదని దేవినేని ఉమా అన్నారు. రాష్ట్రంలో జరిగిన 14 డీఎస్సీల ద్వారా 1,80,000 టీచర్ ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదేనని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓర్వలేక మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కుట్రలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పనున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.



