కొత్తగూడెం, సెప్టెంబర్ 10: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ప్రమాదాల నివారణ చర్యలపై సమీక్షించారు. జిల్లాలో జనవరి నుంచి ఆగస్టు 31 వరకు 349 రోడ్డు ప్రమాదాలు జరగగా 164 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఒక్క ఆగస్టులోనే 36 ప్రమాదాలు జరగగా 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. జిల్లాలో గుర్తించిన 42 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల కారణాలను విశ్లేషించి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రహదారి మార్కింగ్ తదితర భద్రతా చర్యలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. అతివేగం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగించకపోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రహదారులపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని, గుంతలు పూడ్చడంతో పాటు రహదారి పక్కన పొదలను తొలగించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందేలా బ్లాక్ స్పాట్ల సమీప ఆసుపత్రులు, అంబులెన్స్‌లను మ్యాపింగ్ చేయాలని సూచించారు. సమావేశంలో రవాణా, ఆర్అండ్బీ, పోలీసు, పంచాయతీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.




