రాజంపేట ఎస్ఎఫ్ఐ నూతన మండల కమిటీ ఎన్నిక
రాజంపేట, జూలై 14: కడప జిల్లా రాజంపేట మండలంలోని నలంద విద్యాసంస్థల ఆవరణంలో మంగళవారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ సమావేశంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెం.77ను రద్దు చేసి, ప్రైవేట్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
డిగ్రీ హానర్స్ విధానం విద్యార్థుల కోర్సు ఎంపిక హక్కులను పరిమితం చేస్తోందని, పరీక్షల నిర్వహణలో గందరగోళానికి దారితీస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, అనేక హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే వారు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అనంతరం ఎస్ఎఫ్ఐ రాజంపేట మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా ఎస్‌కే ఖయిఫ్, కార్యదర్శిగా వేణు, ఉపాధ్యక్షులుగా ఫైజాన్, విజయ్, జసీఫ్, తరుణ్, సహాయ కార్యదర్శులుగా గోపాల్, సన్నీ, వావీద్, వంశీ, కమిటీ సభ్యులుగా ఈశ్వర్, సుశాంత్, బాలు, సాగర్‌లను ఎంపిక చేశారు.
నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు ఖయిఫ్, కార్యదర్శి వేణు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
– టుడే న్యూస్, రాజంపేట


