రాష్ట్రస్థాయి మెడికల్ కన్వెన్షన్ విజయవంతానికి సమాయత్తం
ఆత్మకూరు, జూలై 14 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
ఆత్మకూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శాఖా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి మెడికల్ కన్వెన్షన్ నిర్వహణ, శాస్త్రీయ దృక్పథం విస్తరణ, ప్రజారోగ్యంపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు షేక్ కాలేషా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు ఎం.వి. చలపతి, జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, డాక్టర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు కేసీ కృష్ణయ్య మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో రాష్ట్రస్థాయి మెడికల్ కన్వెన్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైద్య నిపుణులు, ప్రజారోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఈ కన్వెన్షన్‌లో పాల్గొంటారని చెప్పారు.శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించడం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, మూఢనమ్మకాల నిర్మూలన, ప్రజారోగ్య సమస్యలపై చర్చించడం వంటి లక్ష్యాలతో ఈ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా జన విజ్ఞాన వేదిక సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో స్థానిక శాఖ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని కన్వెన్షన్ ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని నాయకులు సూచించారు.

