కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో గ్రామీణాభివృద్ధి, పేదలకు గృహాల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద తొలి దశలో కేవలం 1,300 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని తుమ్మల వివరించారు. మండలంలోని అర్హులైన పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరిన్ని ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. అలాగే రఘునాథపాలెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.110 కోట్లు మంజూరు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.



