*ద్రాక్షారామం:* ప్రజా పరిపాలనలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ క్షేమం, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పలు గ్రామాల ప్రజలు ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కడియం మండలంలోని మురమండ, మాధవరాయుడుపాలెం, గారడిపల్లి, వీరవరం, మడికి, దుళ్ల, పొట్టిలంక, దొరగారి తోట, గుబ్బలవారిపాలెం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మంత్రి సుభాష్ అభిమానులు ద్రాక్షారామానికి తరలివచ్చారు. మంత్రి సుభాష్ తండ్రి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించి, మంత్రి సుభాష్ పేరున ప్రత్యేక పూజలు చేశారు.
ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవలందిస్తున్న మంత్రి సుభాష్‌కు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భక్తులు ఆకాంక్షించారు.
దక్షిణ కాశీగా భావించే పవిత్ర ద్రాక్షారామం భీమేశ్వర స్వామి సన్నిధిలో తమ అభిమాన నాయకుడు మంత్రి సుభాష్ పేరున ప్రత్యేక పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి నెల పౌర్ణమి రోజున మంత్రి సుభాష్ క్షేమం కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మేడిశెట్టి పెద్దతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, మంత్రి సుభాష్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


