చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన చిన్న శ్రీను
అమరావతి, సెప్టెంబర్ 8 (పున్నమి ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు వైసిపి భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీ కండువా కప్పి చిన్న శ్రీనును సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. దీంతో బొత్స కుటుంబానికి సన్నిహితంగా ఉన్న చిన్న శ్రీను టీడీపీలో చేరడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
🔥 కుమార్తె సిరి సహస్ర కూడా టీడీపీలోకి
చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కూడా తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
బొత్స కుటుంబానికి చెందిన కీలక వ్యక్తి టీడీపీలో చేరడంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేచిందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
చిన్న శ్రీను చేరికతో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తుండగా.. ఈ పరిణామం బొత్స కుటుంబ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.









