ఖమ్మం: వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లను కోల్పోయిన బాధితుల సంఘం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్‌ను కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చివేసి, బాధితులను రోడ్డున పడేసిందని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలిచి భోజనం, మంచినీరు అందించడంతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆదుకున్న పువ్వాడ అజయ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాధితుల తరఫున పోరాటం చేసి, ప్రభుత్వం దిగివచ్చేలా ఒత్తిడి తీసుకువచ్చి ప్లాట్లు ఇప్పించే వరకు అండగా నిలిచినందుకు అభినందించారు. బాధితుల సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఇళ్లు కోల్పోయిన బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితుల సంఘం నాయకులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.



