మండలం బలపం పంచాయతీ పరిధిలోని కొరుకొండ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెనను త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజనులు అధికారులను కోరుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాజ్‌వే కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కాజ్‌వే కొట్టుకుపోవడంతో వీరవరం, తురుమామిడి, బురదమామిడి, బూరుగుబైల్ తదితర గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడం, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, నిత్యావసర సరుకులు తీసుకురావడం కూడా కష్టంగా మారిందని తెలిపారు.
వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలిక కాజ్‌వేపై ఆధారపడటం ప్రమాదకరంగా మారిందని, సంబంధిత అధికారులు వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల రాకపోకలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.


