భారతదేశంలో దాదాపు 10.1 కోట్లు (101 మిలియన్లు) మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అంతేకాకుండా, సుమారు 13.6 కోట్లు (136 మిలియన్లు) మంది ప్రీ-డయాబెటిస్ (Pre-diabetes) దశలో ఉన్నారు.
ప్రీ-డయాబెటిస్ అంటే ఏమిటి?
మన రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, పూర్తిస్థాయి మధుమేహ వ్యాధిగా (Type-2 Diabetes) మారడానికి ముందుండే దశను ‘ప్రీ-డయాబెటిస్’ అంటారు. అంటే, వీరు భవిష్యత్తులో డయాబెటిస్ బారిన పడే ప్రమాదంలో ఉన్నారని అర్థం.
భారతదేశంలో సగటున 11.4% జనాభా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనన్ని మధుమేహ కేసులు మన దేశంలోనే నమోదవుతున్నాయి. అందుకే భారతదేశాన్ని “ప్రపంచ డయాబెటిస్ రాజధాని” (Diabetes Capital of the World) అని పిలుస్తున్నారు.
గతంలో 50 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా వచ్చే ఈ వ్యాధి, ప్రస్తుతం 30 నుండి 45 ఏళ్ల మధ్య ఉన్న యువతలో కూడా అత్యంత వేగంగా విస్తరిస్తోంది.
ప్రీ-డయాబెటిస్‌ను ఎలా గుర్తించాలి?
ప్రీ-డయాబెటిస్ ప్రారంభ దశలో ఎటువంటి తీవ్రమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది దీనిని గుర్తించలేరు. కానీ కొన్ని రక్త పరీక్షలు, శారీరక మార్పులు మరియు ప్రమాద కారకాల (Risk Factors) ఆధారంగా దీనిని ప్రారంభంలోనే గుర్తించవచ్చు.
ఎవరు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి?
35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ: ఎటువంటి శారీరక అసౌకర్యాలు లేకపోయినా ఏటా ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది.
అధిక బరువు ఉన్నవారు (BMI > 23): ముఖ్యంగా పొత్తికడుపు/బొడ్డు చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారు.
కుటుంబ చరిత్ర: తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు షుగర్ వ్యాధి ఉన్నవారు.
అధిక రక్తపోటు (BP): 130/80 mmHg కంటే ఎక్కువ బిపి ఉన్నవారు.
డయాబెటిస్ లక్షణాలు ఉన్నవారు: తరచూ దాహం వేయడం, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లడం, అకారణంగా బరువు తగ్గడం, కాళ్లలో తిమ్మిర్లు రావడం లేదా గాయాలు త్వరగా మానకపోవడం.
మహిళల్లో: పీసీఓడీ (PCOD) సమస్య ఉన్నవారు లేదా గర్భధారణ సమయంలో షుగర్ (Gestational Diabetes) వచ్చినవారు.
పైన పేర్కొన్న ప్రమాద కారకాలు ఉన్నవారు ఏటా కనీసం ఒక్కసారైనా HbA1c లేదా పరగడుపున షుగర్ పరీక్ష (Fasting Blood Sugar – FBS) చేయించుకోవడం ద్వారా ప్రీ-డయాబెటిస్‌ను ప్రారంభంలోనే గుర్తించవచ్చు. తగిన ఆహార నియమాలు, వ్యాయామం ధూమపానానికి దూరంగా ఉండడం, కంటికి సరిపడా నిద్రపోవడం వంటి జీవనశైలి,మార్పుల ద్వారా మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోవచ్చు లేదా షుగర్ వచ్చే అవకాశాన్ని చాలా కాలం పాటు వాయిదా వేయవచ్చు.
డాక్టర్ ఎం.వి. రమణయ్య
రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక
సీనియర్ వైద్యులు, డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, నెల్లూరు.


