ఆత్మకూరు,సెప్టెంబర్ 14 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి పండుగ వేళ ఆత్మకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో వినాయక మండపం ఏర్పాటులో భాగంగా విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తుండగా హోంగార్డు మల్లం ప్రసాద్ (42) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు.మండపం వద్ద విద్యుత్ ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన ప్రసాద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రసాద్ మృతి పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది.ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ టి. వెంకటేశ్వర్లు, సీఐ జి. గంగాధర్, ఎస్‌ఐ జంపానీ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. విధుల్లో సహచరుడిగా, స్నేహశీలిగా ఉన్న ప్రసాద్‌ను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.ప్రసాద్ మృతితో ఆత్మకూరు పోలీస్ క్వార్టర్స్‌తో పాటు ఆయన స్వగ్రామమైన మర్రిపాడు మండలం కృష్ణాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


