**భైంసా, అక్టోబర్ 3 (పున్నమి):** యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో వృత్తి నైపుణ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను యువతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున కుట్టు మిషన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.యువతులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్న శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని యువతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, ఎస్ఆర్టీ, ఆర్ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



