*శ్రీ సిటీ పేలుడు ఘటనపై నుకతోటి రాజేష్ దిగ్భ్రాంతి*మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. శ్రీ సిటీ లోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో శనివారం ఉదయం చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై సత్యవేడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నుకతోటి రాజేష్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందినట్లు వస్తున్న ప్రాథమిక సమాచారం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను కోరారు.ఈ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నుకతోటి రాజేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. గాయపడిన మెరుగైన వైద్యం అందించాలని, అధికారులకు విజ్ఞప్తి చేశారు.ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నుకతోటి రాజేష్ కోరారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన కోరారు.*శ్రీ సిటీలో ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దిశానిర్దేశం తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔషధాలు తయారు చేసే ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రివర్యులకు వివరించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రివర్యులు ఆరా తీశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే శ్రీ సిటీ పరిధిలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై సమీక్ష నిర్వహించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.



