**తీవ్ర ఎండలు, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
*వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
*అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దు*
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం, :
జిల్లాలో తీవ్ర ఎండలు, వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నందున, ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, పుచ్చకాయ, దోసకాయ వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలని తెలిపారు.
బయటకు వెళ్లే సమయంలో గొడుగు, టోపీ, తడి గుడ్డ వంటివి ఉపయోగించాలని, పలుచటి, లేత రంగు దుస్తులు ధరించాలని సూచించారు. వీలైనంత వరకు చెట్ల నీడలో లేదా చల్లని ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.
భారీ భోజనాలు, మద్యం, కాఫీ వంటి డీహైడ్రేషన్‌కు కారణమయ్యే పానీయాలను నివారించాలని, చిన్నపిల్లలను వృద్ధులను ఎండలో ఎక్కువసేపు ఉంచవద్దని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదిలి పెట్టవద్దని సూచించారు.
వడదెబ్బ లక్షణాలైన అధిక జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట, చెమట ఆగిపోవడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే బాధితులను చల్లని ప్రదేశానికి తరలించి, చల్లటి నీటితో శరీరాన్ని తడపాలని తెలిపారు. ఓఆర్‌ఎస్ ద్రావణం ఇవ్వాలని, అవసరమైతే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
ప్రజలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


