పరిగి (శ్రీ సత్యసాయి జిల్లా), ఆగస్టు 6:
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పరిగి మేజర్ పంచాయతీ కేంద్రంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డీఎస్సీ నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలు లక్షలాది మంది అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమయ్యాయని అన్నారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.
ఎన్నికల ముందు ఉద్యోగాల కల్పన, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, పారదర్శక నియామకాలు వంటి హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని ఉషశ్రీ చరణ్ విమర్శించారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం నిరాశపరిచిందని ఆరోపించారు.
వైఎస్సార్సీపీ ప్రధాన డిమాండ్లలో భాగంగా డీఎస్సీ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని, రాష్ట్రంలోని అన్ని ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
యువతకు న్యాయం జరిగే వరకు, ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విస్తరిస్తామని హెచ్చరించారు.
ఈ రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



