జీఎస్టీ చట్టం వచ్చి తొమ్మిదేళ్లయినా విజయవాడ, విశాఖల్లో జీఎస్టీ ట్రైబ్యునల్ బెంచ్‌ల ఏర్పాటు పూర్తికాలేదు. దీంతో పన్ను డిమాండ్ నోటీసుల వివాదాల్లో రాష్ట్రానికి రావాల్సిన 80% రాబడి పెండింగ్‌లో పడిపోయింది. ప్రస్తుతం హైకోర్టులో రూ.9,517 కోట్ల విలువైన పన్ను వివాదాల కేసులు పేరుకుపోయాయి.
చట్టం ప్రకారం వ్యాపారులు వివాదాల పరిష్కారానికి మొదటి అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించి, 10% పన్ను చెల్లించాలి. అక్కడ తేలకపోతే జీఎస్టీ ట్రైబ్యునల్‌కు వెళ్లేందుకు మరో 20% చెల్లించాల్సి ఉంటుంది. అయితే ట్రైబ్యునల్ లేకపోవడంతో వ్యాపారులు నేరుగా హైకోర్టును ఆశ్రయించి ‘రిట్ ఆఫ్ మాండమస్’ కింద స్టేలు పొందుతున్నారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు అందాల్సిన భారీ ఆదాయం నిలిచిపోతోంది.


