రెండు గర్భగుడులున్న ప్రత్యేకాలయం
రాముడు పూజలు చేసి ప్రతిష్టించిన శివలింగం
పాలకులు పట్టించుకోని గ్రామం
నెల్లూరు జిల్లాలో గొప్ప చారిత్రక ప్రాశ స్త్యం వున్న గ్రామం పంట్రంగం. తూర్పు చాళుక్య ప్రభువు గుణగ విజయాదిత్యుని (క్రీ.శ.893) సేనాని పండరంగడు తన విజయ యాత్రకు సంకేతంగా ఈ వూరిని అందులోని శివాలయాన్ని నిర్మించాడు. చాలా వరకు సముద్ర గర్భంలో కలిసి పోయిన ఈ చారిత్రక పట్టణంలో శివాలయం, దాని పరిసరాలలో ఐదారు కుటుంబాలు మాత్రం ప్రస్తుతానికి కన్పిస్తాయి. పురావస్తుశాఖ వారు శ్రద్ద చూపి తవ్వకాలు జరిపితే… ఎన్నో ఆసక్తికర చారిత్రక విషయాలు వెలుగు చూసే అవకాశం వుంది.
పౌరాణిక ప్రాశస్త్యం :
పులికాడు సముద్ర తీరప్రాంతంలో అర కోటి లింగాలకు రావణాసురుడు నిత్యమూ పూజలు చేసేవాడట. రావణుని చంపి, అయోధ్యకు తిరిగి వెళ్ళే సమయంలో రాములవారు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారట. ఆంజనేయుని కైలాసం పంపి, శివలింగం తెమ్మన్నారు. అక్కడ గణేశునితో వాదనకు దిగిన హనుమంతుడు లింగం తేవడం ఆలస్యమయింది. ఈలోగా ముహుర్తం మించిపోతుందని గ్రహించిన సీతమ్మ ఇసుకతోనే లింగా కారం చేసింది. దానినే రాముల వారు ప్రతిష్టించారు. కైలాసం నుండి శివలింగాన్ని తెచ్చిన హనుమ కోపంతో ఇసుక లింగాన్ని పెకిలించాలని చూశాడు. వీలు కాలేదు. రాముడు హనుమంతుడ్ని ఓదార్చి, తన భక్తుడు తెచ్చిన లింగాన్ని కూడా పక్కనే ప్రతిష్టించాడు. అందుకే పంట్రంగంలో రెండు గర్భగుడులున్నాయి. రామలింగేశ్వరుడు, పండ రంగేశ్వరుడూ అనే పేర్లతో రెండు శివలింగాలున్నాయి. ఈనాటికీ సూర్యోదయం వేళలో ఈ లింగాల పై సూర్య కిరణాలు పడతాయి. ఈ ఆలయం నుండి కాశీలోని విశ్వేశ్వరాలయం వరకు సొరంగం వుండేదని అంటారు.
చారిత్రక ప్రాశస్త్యం :
తూర్పు చాళుక్య రాజయిన గణగ విజయా దిత్యుడు (క్రీ.శ.843) ఉత్తరాదిన కళింగ వర కు జయించాడు. ఇతడు రాష్ట్రకూట రాజయిన రెండవ కృష్ణునితో అనేక సార్లు యుద్ధాలు చేశాడు. ఈ రాష్ట్రకూట రాజుకు గాంగులు సహాయపడ్డారు. విజయాదిత్యుడు గాంగులను ఓడించాడు. నెల్లూరు జిల్లాలో దొరికన ఒక శాసనంలో ఇతడి గొప్పతనానికి కారణం ఇతని సేనాని అయిన పండరంగడని చెప్పబడింది. ఒంగోలు సమీపాన ధర్మపురం వద్ద దొరికిన శాసనంలో కూడా పండరంగని గొప్పతనం చెప్పబడింది. అద్దంకి వద్ద దొరికన శాసనంలో ఇతని పేరు ‘పాండురంగ’డనే అని వుంది. ఉదయగిరి సమీపాన వున్న పాండురంగం అనే గ్రామం కూడా ఇతని పేరుమీద వెలి సిందే. అక్కడి ఆలయమూ ఇతరు కట్టించిందే.
మచిలీపట్నం వద్ద దొరికిన ఒక శాస నంలో గుణగ విజయాదిత్యుడు కిరణపురాన్ని అచలపురాన్ని (కొండపల్లి) నెల్లూరు పురాన్ని జయించినట్లు అందువల్ల అతనికి ‘త్రిపుర మర్త్య మహేశ్వర’ బిరుదు లభించినట్లు వుంది. దీన్ని బట్టి తూర్పు చాళుక్య రాజ్యం నెల్లూరు వరకు విస్తరించి వుండిందని తెలుస్తోంది.
వీరి కాలంలో నెల్లూరుకు పడమర ప్రాంతాల్లో బోయలనే కాకల తీరిన యోధులుండేవారు. వీరు పాలించే ప్రాంతాలకు ‘బోయకొట్టాలు’ అనే వారు. ఇలాంటివి అప్ప ట్లో పన్నెండు వుండేవి. అందులో ముఖ్య మైనవి కందుకూరు, నెల్లూరు.
గుణగ విజయాదిత్యుడు అధికారంలోకి రాకముందు చాళుక్యులకు బోయలు సామం తులు. విజయాదిత్యుడు రాజ్యాధికారం చేప ట్టగానే వీరు స్వతంత్రం ప్రకటించుకున్నారు. కడెయరాజు కొడుకైన పండరంగడు విజయా దిత్యుని సేనాని. గొప్ప శక్తి మంతుడు.
విజయాదిత్యుడు బోయల్ని అణచడానికి పండరంగని సైన్యంతో పంపాడు. బోయలు కట్టెందుర్గం, నెల్లూరు వద్ద సైన్యాన్ని మోహ రించారు పండరంగడ్ని నిలవరించడానికి.
పండరంగడు కట్టెం దుర్గాన్ని నేలమట్టం చేశాడు. నెల్లూరు పట్టణాన్ని తగలబెట్టాడు. పన్నెండు బోయ కొట్టాలను తిరిగి చాళుక్య రాజ్యంలో కలిపాడు. నెల్లూరు నుండి తొండ మండలం సరిహద్దుల్లో వున్న పులికాట్టు దాకా తన సైన్యంతో వెళ్ళి, అక్కడ తన విజయాలకు సంకేతంగా పండ్రంగం అనే వూరు కట్టాడు. పాండురంగేశ్వరస్వామిని ప్రతిష్టించాడు. అదే ఇప్పటి పంట్రంగం. చాళుక్యుల తర్వాత చోళుల ఆధీనంలోకి ఈ ప్రాంతం వచ్చింది. తిరయన్ అనే రాజు ఈ పట్రంగాన్ని పాలించినట్లు తెలుస్తోంది. మొదటి కుళోత్తుంగుని శాసనాలు ఈ ఆలయంలో కన్పిస్తాయి. ఈ శాసనాల్లో ఈ వూరిని భవాద్రికోట అన్నారు. రాజరాజ చోళుడు ఈ ఆలయానికి దానాలు చేశాడు. రాజరాజ చోళ పరాంతకుడు ఈ ఆలయానికి మాన్యాలిచ్చాడు. ముమ్మడి వైదంబ మహారాజు దీపపు సమ్మెలిచ్చాడు. నెల్లూరును ఏలిన విజయ గండ గోపాలుడు కామాక్షి అమ్మవారిని ఆలయంలో ప్రతిష్టించాడు. శాసనాల్లో అమ్మ వారిని ‘కామకోటి’ అన్నారు.
ఈ ఆలయంలో పావన వినాయకుని గుడి కూడా వుంది. శ్రీకృష్ణదేవరాయలు వేసవిలో చల్లదనం కోసం ఈ దీవులకు వచ్చేవారని ఇక్కడివారంటారు. ఇక్కడి దగ్గర్లో ‘రాయదొరువు’ అనే గ్రామం వుంది. ఇక్కడ నివసించే పాకనాటి రెడ్లు మాట్లాడే తెలుగు రాయలసీమ మాండలికమే. ఒకప్పుడు రాయల వారికి తాము సామంతులమని వారు చెప్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం గల గ్రామానికి ఇప్పటికీ సరయిన దారి లేదు. సూళ్ళూరుపేట నుండి శ్రీహరికోటకు వెళ్ళేదారిలో అటకాని తిప్ప వద్ద దిగి ఉప్పు కయ్యల్లో, నీళ్ళలో, బండ్ల మీద కాని, ట్రాక్టర్ల మీద గాని పంట్రంగం చేరవచ్చు. మల్లాం నుండి ఆటోలు వెళుతుంటాయి. వెయ్యి ఎకరాల మాన్యం గల ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోలేక పోవడం ఆవేదన కల్గిస్తుంది.
డాక్టర్ గంగిశెట్టి శివకుమార్,
బాలసాహితీవేత్త మరియు
పున్నమి దినపత్రిక గౌరవ సంపాదకులు.
సెల్ : 9441895343