టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టు భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోయిందని టీడీపీ నేత వెంకట నరసయ్య అన్నారు. బుధవారం ఒంటిమిట్టలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని వందలాది నగరాలతో పాటు సుమారు 89 దేశాల్లోని తెలుగు ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారని తెలిపారు.ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు పేరు లేకుండానే ఆయనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని వెంకట నరసయ్య ఆరోపించారు. అప్పటి డీఐజీ కొల్లి రఘురాం రెడ్డి పోలీస్ మాన్యువల్‌కు, న్యాయ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులపాటు నిర్బంధించారని అన్నారు.జగన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాయలసీమలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో చంద్రబాబు చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా చిత్తూరు జిల్లా అంగళ్లలో ఆయనపై పెద్ద ఎత్తున రాళ్లదాడి జరిగిందని వెంకట నరసయ్య పేర్కొన్నారు. ఈ ఘటనలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, ఈ క్రమంలో ఆయన గాయపడినట్లు తెలిపారు. చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిని తిప్పికొట్టి ధీటుగా వ్యవహరించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీరు టీడీపీ శ్రేణుల దృష్టిలో చరిత్రగా నిలిచిందన్నారు.అక్రమార్జన కేసుల్లో జగన్‌రెడ్డి గతంలో జైలులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వెంకట నరసయ్య, రాజకీయ కక్షతో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజా ఉద్యమాలు, న్యాయపోరాటాల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్య విలువలు, చట్టపరమైన పాలనకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకుడు ఉన్నం కిరణ్‌కుమార్, రాజంపేట పార్లమెంటు పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు పుపుత్తా రామచంద్రయ్య, భగవాన్ సహాయరెడ్డి, రాష్ట్ర ఆర్ఎంపీల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ శివకుమార్, పార్లమెంటు పార్టీ మాజీ కార్యదర్శి కటితం రామ్మోహన్ నాయుడు, ఒంటిమిట్ట మండల నాయకులు గంగపేరు కృష్ణారెడ్డి, పసుపులేటి మల్లికార్జున, యువ నాయకులు వినోద్‌రెడ్డి, రాశిపల్లె టీడీపీ నాయకులు మౌలాలి, సాలాబాద్ కృష్ణారెడ్డి, గుర్రంకొండ శ్రీనివాసులు, మఠం రాజు, సీనాయకుడు ఈగల తిరుపాలయ్య తదితరులు పాల్గొన్నారు.


