విశాఖపట్నం, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గాజువాకలోని స్వామి విద్యానికేతన్ హై స్కూల్ రోడ్, సాయిరాం నగర్లో స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ పార్థసారధి గారు హాజరై, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పౌర హక్కుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు తుంపాల శ్రీరామ్ మూర్తి, అలాగే పెదగంట్యాడ మండల ప్రభుత్వ వైద్యశాల అధికారి మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పీ. హేమలత గారు పాల్గొన్నారు.
అతిథులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు దేశ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం అమోఘమని, ఆయన చూపిన మార్గంలో నడిచేలా యువత సమాజానికి దోహదం చేయాలని సూచించారు. అంబేద్కర్ బోధనలు సమాజ సమానత్వానికి మార్గదర్శకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కౌట్స్, గైడ్స్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని విద్యార్థుల్లో చైతన్యం నింపేలా నిర్వహించినందుకు హర్షం వ్యక్తమైంది.