కుతుకులూరు, ఆగష్టు 4 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): కుతుకులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సదుపాయాలపై పేషెంట్లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా, చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు, మందులు సకాలంలో లభిస్తున్నాయా అనే అంశాలపై రోగులను ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో మందుల లభ్యత, వైద్య సౌకర్యాలు, సిబ్బంది పనితీరుపై అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, పీహెచ్‌సీకి వచ్చే ప్రతి రోగికి అవసరమైన చికిత్స, మందులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. బాధ్యతగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.




