ఎస్. హెచ్. జి మహిళా కుటుంబ సభ్యులకు జాబ్ మేళా
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మిస్సన్ డైరెక్టర్ మెప్మా, జీవీఎంసీ యు సి డి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.ఎం సత్యవేణి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం సభ్యుల కుటుంబ సభ్యులలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా కార్యక్రమాన్ని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా చేసి విశాఖ ను అభివృద్ధి పథంలో ఉంచేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈ నెల 14, 15 తేదీల్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించి అనేక కంపెనీలు తో ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే స్వయం సహాయక సంఘం కుటుంబ సభ్యులలో నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళాకు టాటా ఎలక్ట్రానిక్స్, పేటియం, ఎల్ & టి ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, భారత్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, ఐ ప్రోసెస్, సంగీత మొబైల్స్ మొదలైన 21 కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళ లో పాల్గొన్నారని తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఆన్లైన్ లో 2328 మంది రిజిస్ట్రేషన్ చేసుకొనగా జాబ్ మేళాకు 831 మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారని, వారిలో 282 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని మేయర్ తెలిపారు.
అనంతరం తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించి నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ద్వారా అనేక కంపెనీలు విశాఖ వస్తున్నాయని, తద్వారా దాదాపు ఏడు లక్షల 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు. నేడు నిరుద్యోగులైన స్వయం సహాయక సంఘం కుటుంబ సభ్యులకు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని, ఈ జాబ్ మేళా ద్వారా దాదాపు 282 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని శాసనసభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఎం సత్యవేణి, యు సి డి ప్రాజెక్ట్ ఆఫీసర్ సూర్య కళ, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు కార్తీక్, ఏపీడీలు, డీఎంసీలు, ఏడిఎంసీ లు, సి డి సి లు, పిఓలు, రిసోర్స్ పర్సన్ తదితరులు హాజరయ్యారు


