ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రజాదర్బార్
విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 13. పున్నమి ప్రతినిధి
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శృంగవరపుకోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్.కోట మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు ప్రత్యక్షంగా విన్నవించుకుని, లిఖితపూర్వకంగా వినతి పత్రాలను అందజేశారు.
ప్రజాదర్బార్లో రహదారుల నిర్మాణంపై అర్జీలు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, అర్జీదారుల సమస్యలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ.. ప్రతి అర్జీకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.


