ఆర్టీఐ దరఖాస్తులకు తాళం.. కలెక్టరేట్‌లో చట్టం అమలవుతోందా..?
రెండు నెలలు దాటినా సమాచారం లేదు.. జిల్లా రెవెన్యూ అధికారిపై తీవ్ర విమర్శలు
కలెక్టర్ పర్యవేక్షణ ఎక్కడ..? ప్రజల హక్కులను కాలరాస్తున్న అధికారులపై చర్యలేవి..?
పున్నమి ప్రతినిధి
ఆసిఫాబాద్ | 01-08-2026
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం (RTI) అమలుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారికి (DRO) 2026 ఏప్రిల్ 10న పింగిలి రమేష్, సోనియా, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు సమర్పించినప్పటికీ, చట్టం నిర్దేశించిన గడువు దాటినా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందించలేదు.
సమాచార హక్కు చట్టం ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో సమాచారం ఇవ్వడం సంబంధిత అధికారుల చట్టబద్ధమైన బాధ్యత. అయితే ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో మాత్రం ఆ నిబంధనలు అమలవుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికారులే చట్టాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
“సమాచారం ఇవ్వలేని అధికారులు ప్రజలకు ఎలా జవాబుదారీ అవుతారు?” అని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్ చుట్టూ పలుమార్లు తిరిగినా స్పందన లేకపోవడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు పారదర్శక పాలన అందించాల్సిన జిల్లా పరిపాలనలోనే సమాచార హక్కు చట్టం అమలు కాకపోతే, సాధారణ ప్రజలకు న్యాయం ఎలా జరుగుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ వెంటనే ఈ వ్యవహారంపై స్పందించి, ఆలస్యానికి కారణమైన అధికారులను బాధ్యులను చేసి, దరఖాస్తుదారులకు వెంటనే సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ఆర్టీఐ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల మౌనంపై కలెక్టర్ సమాధానం చెబుతారా..? లేక ఆర్టీఐ దరఖాస్తులు దుమ్ము పట్టే ఫైళ్లుగానే మిగిలిపోతాయా..? అనే ప్రశ్నలకు జిల్లా యంత్రాంగం సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




