ఆరు నెలలుగా పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్
ఆత్మకూరు, ఆగస్టు 12 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి బస్టాండ్ ప్రాంగణంలో ప్రధాన రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత ప్రయాణికులు, వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. గత ఆరు నెలలుగా గుంత అలాగే ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలోని ప్రధాన రహదారి మధ్యలోనే గుంత ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంత సరిగా కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా వచ్చే వాహనాలు గుంతను తప్పించే క్రమంలో అదుపుతప్పే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.ఇదే బస్టాండ్ ప్రాంగణంలో తరచూ రాజకీయ సమావేశాలు, వివిధ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ నట్టనడిరోడ్డుపై ఉన్న ఈ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణంలో మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఆరు నెలలుగా ప్రధాన రహదారిపై ఉన్న ఈ గుంత వారి దృష్టికి రాకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?
గుంత కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్యను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఆత్మకూరు పురపాలక సంఘం అధికారులు తక్షణమే స్పందించి గుంతను నాణ్యమైన పద్ధతిలో మరమ్మతు చేసి, భవిష్యత్తులో మళ్లీ గుంత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు.. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలి” అని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


