తల్లిపాలు శిశువుకు తొలి టీకా – వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న

ఆత్మకూరు, ఆగస్టు 5 (పున్నమి ప్రతినిధి): యూపీహెచ్సీ అరుంధతివాడ పరిధిలోని రాదమ్మ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, పోషకాహారంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ సాయి ప్రసన్న మాట్లాడుతూ, నవజాత శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని అన్నారు. పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు ఇచ్చే జున్నుపాలు (కొలస్ట్రమ్) తొలి టీకాలా పనిచేసి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని వివరించారు. శిశువు పుట్టిన మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం వయస్సుకు అనుగుణంగా సమతుల్య పోషకాహారాన్ని అందించాలని సూచించారు.
గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తల్లిపాల వల్ల శిశువుల ఎదుగుదల మెరుగుపడటంతో పాటు అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ ఎస్. సుధాకర్, హెచ్వీ పార్వతి, ఏఎన్ఎం ఎస్కే నూర్జహాన్, అంగన్వాడీ కార్యకర్త రాదమ్మ, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

